ఒలింపిక్స్ మొదలెట్టడం వెనక అసలు ఎజెండా తెలుస్తే ఆశ్చర్యపోతారు
ప్రతి నాలుగేళ్లకి ఒకసారి ప్రపంచదేశాల దృష్టిని తనపై నిలుపుకొనే క్రీడా సంరభం ఒలింపిక్స్. దీని గురించి ప్రపంచమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూంటుంది. అయితే ఈ ఒలింపిక్స్ ఈ మధ్యకాలంలో ప్రపంచం డిజైన్ చేసిన ఉత్సవం ఏమీ కాదు. మన తాత..ముత్తాతలు..ఇంకా చెప్పాలంటే వారి ముత్తాతల కాలం నుంచి ఈ ఒలింపిక్స్ ఆటల పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత పురాతన కాలం నుంచి అంటే… క్రీ.పూ 772లోనే ఇలాంటి క్రీడోత్సవాలు జరిగేవి. క్రీ.పూ. 776 నుంచి. క్రీ.శ. 394 వరకు నాలుగేళ్ళకొకసారి ఒలింపియా ప్రాంతంలో 1200 సంవత్సరాల పాటు కంటిన్యూగా జరిగాయి. ఇంత ఘనమైన ఆలోచన మన పూర్వీకులకు ఎలా వచ్చిందీ అంటే.. ఓ గమ్మత్తైన చరిత్రపుటల్లోకి వెళ్లాల్సిందే.
క్రీ.పూ776లో మొదటగా గ్రీకు రాజ్యాల మధ్య తరచూ యుద్దాలు జరుగుతూండేవి. ఎవరికీ మనశ్సాంతి అనేది ఉండేది కాదు. ఎవరొచ్చి యుద్దం చేస్తాడో..ఏ దేశం దండయాత్ర చేస్తుందో అని భయపడుతూ రాజులు బ్రతుకుతూండేవారు. ఈ నేపధ్యంలో విసుగెత్తిన వారంతా .. ఈ యుద్ధాలకు పరిష్కారంగా తమ దృష్టిని వేరే వైపు మళ్లించాలని, తమ గొప్పతన్నాని కేవలం యుద్ద భూమిలో చూపెట్టుకోవటం అనే కార్యక్రమం కన్నా .. క్రీడలను నిర్వహించి, గెలిచిన దేశం ఘనత చాటాలని . తద్వారా శాంతి స్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన అందరికీ నచ్చింది. ఎలాగైనా తమ దేశం గురించి మిగతా వాళ్లు గొప్పగా మాట్లాడుకోవాలనే ఆలోచనకు ఇది తీరుస్తోంది కదా అని అంతా శాంతించి, ఒలింపిక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ క్రమంలోనే మొదటి ఒలింపిక్ క్రీడలు నిర్వహించారు. క్రీశ. 393 వరకు ప్రతి నాలుగేళ్లకోసారి నిరాటంకంగా జరుగుతూ ఉండేవి. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఆలివ్ కొమ్మలను బహూకరించేవారు. ఈ క్రీడలను ఒలింపియా స్టేడియంలో జరిగినందున వీటికి ఒలింపిక్ క్రీడలు అనే పేరు స్థిరపడింది. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..గ్రీకు సామ్రాజ్యాన్ని రోమన్ చక్రవర్తి అయిన థియోడొసియస్ అనే రోమన్ చక్రవర్తి జయించి ఈ ఒలింపిక్ క్రీడలను నిషేధించారు. ఆ తర్వాత చాలా కాలానికి మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలని అందరికీ ఆసక్తి కలిగింది. 1892లో ఒలింపిక్ క్రీడలను తిరిగి పునరుద్దరించాలని పియరీ డి కొబర్టిన్ పట్టుబట్టారు. ఆయన కృషి ఫలితంగా 1896లో మొదటగా ఎథెన్స్లో పునఃప్రారంభించారు. వీటినే ఆధునిక ఒలింపిక్ క్రీడలని, కొబర్టిన్ను ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడని పేర్కొన్నారు. 1916లో ఏడో ఒలింపిక్ క్రీడలు బెర్లిన్లో జరగాల్సి ఉండగా అవి మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. అలా హెల్సింకీ(1940), లండన్(1944)లో జరగాల్సిన క్రీడలు రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. ఆ తరవాత ఈ క్రీడలు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. ఒలింపిక్ క్రీడల్లో 9 క్రీడాంశాలు ఉన్నాయి. అథ్లెటిక్స్, సైక్లింగ్, కత్తి యుద్ధం, జిమ్నాస్టిక్స్, బరువు లెత్తడం, షూటింగ్, ఈత పోటీలు, టెన్నిస్, మల్లయుద్ధం పోటీలు జరిగాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 28కు చేరింది.