‘చదరంగం’ ఏ దేశంలో మొదలైంది, దానికి చెస్ అనే పేరు ఎలా వచ్చింది

చెస్..చదరంగం  ఈ ఆట ఆడేవాళ్లు తెలివైన వాళ్లుగా మనం లెక్కేస్తూంటాం. ఎందుకంటే ఇది ఓ ఇంటిలిజెంట్ గేమ్. మన బుర్రకు పదును పెడుతూ..ఉత్కంఠను కలుగ చేస్తూ ఈ ఆట సాగుతుంది. వాస్తవానికి పూర్వకాలంలో చదరంగాన్ని రాజుల ఆటగా పరిగణించేవారు. ఇది అన్నింటికంటే ప్రాచీన క్రీడ అని చెప్తూంటారు. ఐదువేల సంవత్సరాల క్రితం ఈ ఆట మొదలైందని కొందరి చరిత్రకారుల అంటనా.
మన దేశంలో  అయితే గుప్త చక్రవర్తి 6వ శతాబ్దంలో చతురంగ పేరుతో ఆట మొదలు పెట్టారని చరిత్రకారులు చెబుతుంటారు.  అప్పట్లో  రాజులు, చక్రవర్తులు యుద్ధ కళలను నేర్చుకునేందుకు ఎవరికీ హానికలగని చదరంగం ఆడేవారట! ఈ ఆట రెండువేల సంవత్సరాలపాటు భారతదేశానికే పరిమితమైంది. అనంతరం కుషన్ చక్రవర్తి ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత నెమ్మదిగా పర్షియా, అరేబియా, ఐరోపా దేశాలకు పాకింది. కాలక్రమేణా అన్ని దేశాల్లోనూ బాగా ప్రచారం పొందింది. 
ఆ క్రమంలో చదరంగం ఆట ఇంగ్లండుకు 1255లో చేరింది. క్రీ.శ. 1851లో లండన్‌లో మొదటి అంతర్జాతీయ చదరంగం పోటీ జరిగింది. 1924లో అంతర్జాతీయ చదరంగపు ఆటగాళ్ల సమాఖ్య ఫ్రాన్సులో ఏర్పడింది. 1894 నుంచి 1921 వరకు అంటే 27ఏళ్లు జర్మనీకి చెందిన డాక్టర్‌ ఎమాన్యుల్‌ లస్కర్‌ విశ్వ విజేతగా నిలిచారు. అతి చిన్నవయసులో చదరంగంలో విశ్వ విజేత అయిన ఖ్యాతి ‘మిఖాయిల్‌ నిఖేమ్‌విచ్‌’కు దక్కింది.
దేశంలో అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు ఉన్నారు. దేశానికి చెందిన విశ్వనాథన్‌ఆనంద్ పలుసార్లు ప్రపంచచాంపియన్‌గా నిలిచారు. రాష్ట్రానికి చెందిన పలువురు చెస్ క్రీడాకారులు గ్రాండ్‌మాస్టర్ హోదా పొందారు.ఇప్పుడిది రష్యా వారి జాతీయ క్రీడ. ‘షా’ అన్న పెర్షియన్‌ పదం నుంచి ‘చెస్‌’ అనే ఇంగ్లీషు పదం పుట్టింది. ‘షా’ అంటే రాజు అని అర్థం. 
  ఈ ఆట మెదడు పనితీరును మెరుగుపరిచి సృజనాత్మకంగా ఆలోచించేలా చేస్తుంది. మంచి నేర్పరితనం అలవడుతుంది. అందుకే ఈ ఆటను పిల్లలు నేర్చుకోవడం ఎంతో అవసరం. మరి మీరూ నేర్చుకుంటారుగా? ! 
చెస్ పావుల పేర్లు కింగ్(రాజు), క్వీన్(మంత్రి), రాక్స్(ఏనుగు)-2, బిషప్స్(శకటం)-2, నైట్స్(గుర్రం) 2, పాన్స్(బంటు)-8 ఉంటాయి.